Thursday 16 May 2013

Episode - 3



రివ్వున లేచి అంబులెన్స్ కి కాల్ చేసి క్రిష్టినాని రెండుచేతుల్లోకి ఎత్తుకొని బయటికి వెళ్ళేసరికి అంబులెన్స్ వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్ కి తీసుకెళ్ళి జాయిన్ చేసాడు.

ఇంత రగడకూ కారణమైన సామంత్ చేసిన ద్రోహానికి స్వతహాకా మృదు స్వభావి ఐన కృష్ణమోహన్ సైతం అదుపులేని లేని అశాంతితో రగిలిపోయాడు. ఈలోగా విషయం తెలిసిన క్లాస్ మేట్స్ వచ్చేసరికి కాస్త తమాయించుకొన్నాడు. డాక్టర్స్ షి ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాక ఇంటికి బయల్దేరాడు. ఇంటికి వెళ్ళగానే తల్లి నుంచి అర్జెంట్ గా రమ్మని కాల్. ఇండియాలో పని అవ్వగానే వస్తానని స్నేహితులకి క్రిష్టినా బాధ్యత అప్పగించి ఇండియా వచ్చాడు.

******************************************************************************
ఇల్లు చేరేసరికి ఏవో అపశకునాలు తోచడం మొదలయ్యింది. విదేశాల్లో చదువుకొంటున్న తనకి ఈ సిల్లీ సెంటిమెంట్సేంటా అనుకొంటూ చిన్నగా నవ్వుకొని ఇంట్లో అడుగుపెట్టాడు. ఎదురుగా కనిపించిన తల్లి స్వరూపం అపశకునాల ప్రభావాన్ని చూపింది. ఎప్పుడూ లక్ష్మీదేవిలా ఒంటినిండా నగలతో పదిమంది పనివాళ్ళకి పనులు పురమాయిస్తూ, ఇంటినిండుగా ఉన్న చుట్టాలతో హడావుడిగా మాట్లాడుతూ తిరిగే తల్లి శోకదేవతలా కూర్చొని ఉంది. తండ్రికోసం వెతికిన కళ్ళకి తండ్రి రూం లోంచి బయటికి వస్తున్న డాక్టర్ కనిపించారు.

ఆందోళనగా "అమ్మా" అంటూ ఇంట్లో అడుగు పెట్టగానే "బాబూ కృష్ణా..." అంటూ పరుగెత్తివచ్చి కొడుకు గుండెలపై తలవాల్చి భోరుమంది శాంత.

తల్లిని పొదివిపట్టుకొని "అమ్మా! ఏమయ్యింది? నాన్నేరి" అన్నాడు.

"ఆ దేవుడు చిన్న చూపు చూశాడ్రా. చక్రి అంకుల్ బిజినెస్ లో మోసం చేసాడు. మన ఆస్థులన్నీ అప్పులు తీర్చేందుకే సరిపోయాయిరా. మీ నాన్నగారికి హార్టెటాక్ వచ్చింది. డాక్టర్ తో నువ్ మాట్లాడ్రా నాకేం చెప్పట్లేదు" అంటూ ఏడ్వడం మొదలెట్టింది.

"అమ్మా ఊరుకో. నే వచ్చానుగా. అన్నీ నే చూసుకుంటాను" అంటూ డాక్టర్ కి ఎదురెళ్ళి "డాక్టర్ హౌ ఈస్ మై ఫాదర్?" అని అడిగాడు.

"కమాన్ మై బాయ్" అంటూ కృష్ణమోహన్ని తీసుకుని శశాంక్ రూం లోకి దారితీశాడు డాక్టర్.

రూం లో అడుగు పెట్టగానే పరిస్థితి అర్థమైపోయింది కృష్ణమోహన్ కి. తండ్రి ఆఖరి ఘడియల్లో ఉన్నారని. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. తమాయించుకుంటూ డాక్టర్ కేసి చూశాడు.

"బి బోల్డ్ మై బాయ్. లెట్ హిం స్లీప్ పీస్ఫుల్లీ" అన్నాడు డాక్టర్.

"నాన్నా" అంటూ తండ్రి కాళ్ళపై పడి ఏడవడం మొదలెట్టాడు.

స్పృహ వచ్చిన శశాంక్ "నాన్నా కృష్ణా వచ్చావా? నీకేం ఇవ్వకుండా పోతున్నాను నన్ను మన్నించరా. కానీ జీవితంలో చక్రి కుటుంబానికి దూరంగా ఉండు. వివరాలన్నీ నా డైరీలో ఉన్నాయి. పగలు ప్రతీకారాల జోలికి పోకు. సాధ్యమైనంతగా దేశసేవ చెయ్యి. ఇదే నా ఆఖరికోరిక" అని చెప్పి తలవాల్చేశాడు.

కొడుకు వెన్నంటి వచ్చిన శాంత "ఏమండీ" అని అరుస్తూ స్పృహ కోల్పోయింది.

మేనమామ, తండ్రి సన్నిహితులూ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు సజావుగా జరిపించి అప్పులన్నీ తీర్చి "బాబూ కృష్ణా! నువ్ లండన్ వెళ్ళి చదువు పూర్తి చేసుకొని రా. తరవాత ఇక్కడి విషయాలు చూసుకుందాం" అన్నారు. కానీ మనస్కరించక తండ్రి డైరీ లో వివరాలు మననం చేసుకుంటూ సామంత్ ఇంటికి బయలుదేరాడు.

సామంత్ ఇల్లు చేరగానే తనకళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఇంద్రభవనంలాంటి ఏడంతస్థులమేడ. వాచ్ మన్ వినయంగా నమస్కరించి గేటు తీసాడు. లోపలికి అడుగు పెట్టగానే హాల్ లో సోఫాలో కూర్చొని పార్ట్నర్స్ తో మాట్లాడుతున్న చక్రి అంకుల్ కనిపించాడు. రక్తం మరుగుతున్నా తండ్రి మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని నిదానించుకొన్నాడు.

కృష్ణమోహన్ని చూడగానే మోమునిండా ఆనందం పులుముకొంటూ "ఓ.కే జెంటిల్ మెన్! లెట్స్ మీట్ ఇన్ ఆఫీస్" అని "శారదా! మన కృష్ణొచ్చాడు" అంటూ లేచి ఎదురొచ్చాడు చక్రవర్తి.

"రా కృష్ణ నాన్న పోయాడట కదా సారీరా ఆ టైం కి మేం యూ. ఎస్ వెళ్ళాం మా కోడలు ఏవో షాపింగ్ చేద్దామంటే" అని అక్కడికి అదేదో జస్ట్ సో సో అన్నట్లుగా లైట్ తీసుకోమన్నట్లుగా.

లోపలినుంచి ఆతృతగా వచ్చిన శారద తనంత ఎదిగిన కృష్ణని చూసి ఆప్యాయంగా "రా బాబూ ఎన్నాళ్ళయింది నిన్ను చూసి" అంటూ చెయ్యి పట్టుకోబోయింది.

మధ్యలోనే ఆమె చేయందుకొని "కడుపునిండా తిండి తిని ఎన్నాళ్ళయిందో నీ చేత్తో టిఫిన్ చేసి పెట్టు" అంటూ అడ్డుకున్నాడు చక్రవర్తి.

ఈ లోపు మేడమీదనుంచి దిగి వస్తున్న సామంత్ "హలో కృష్ణా! ఇండియా ఎప్పుడొచ్చావ్? ఇదేనా రావడం" అంటూ కాజువల్ గా పలకరించి "నాకు పనుంది మళ్ళీ కలుస్తా" అంటూ "కమాన్ డాళింగ్" అని భార్యతో కలిసి వెళ్ళిపోయాడు.

హాల్ మొత్తానికి ఇద్దరూ మిగిలిపోయారు. భయంకరమైన నిశ్శబ్దం. చివరికి కృష్ణ "ఏంటంకుల్ బిజినెస్ లో మా డాడీ నష్టపోవడమేంటి? మీరు మాత్రం బాగుండడమేంటి" అని అడిగాడు.

ఖంగు తిన్నా అనుభవశాలి కావటం మూలాన పాత సినిమాలో రాజనాలలా నవ్వుతూ "దాందేముంది మీ నాన్న జనాలని నమ్మి ష్యూరిటీలిచ్చి మునిగిపోయాడు. నే జాగ్రత్తగా ఉండి బతికిపోయాను" అన్నాడు అదేదో సాధారణ విషయమన్నట్టు.

"మీకు తెలియని వాళ్ళకి నాన్న ష్యూరిటీలెందుకిస్తారు? నాన్న జనాలని నమ్మి మోసపోలేదు మిమ్మల్ని నమ్మి ఆహుతయ్యారు" అన్నాడు ఆవేశంగా...

"నీకేం తెలుసురా పిల్ల కాకివి. అసలు మీ అమ్మనిచ్చి చెయ్యడానికి కూడా మీ తాత ఒప్పుకోకపోతే నేనే ఒప్పించాను మీ నాన్న అంత సమర్థుడురా" అన్నాడు వెటకారంగా.

తండ్రి డైరీలో విషయాలన్నీ చదివిన కృష్ణమోహన్ కి మనసు రగిలిపోయింది. శారద ఆంటీ తండ్రిని ఒప్పించి చక్రి అంకుల్ కి పెళ్ళి చేసిన తండ్రి గురించి అలా మాట్లాడుతుంటే. అప్పుడే అక్కడికి వచ్చిన శారద కల్పించుకొంటూ "బదులు తీర్చుకొన్నారు లెద్దురూ మీకూ నన్నిచ్చేందుకు అన్నయ్య కల్పించుకోవలసి రాలేదా" అని వాతావరణాన్ని తేలికపరిచే యత్నం చేసింది.

"బాబూ టిఫిన్ తిను" అంటూ ప్లేట్ అందించింది.

"వద్దు ఆంటీ నే అంకుల్ తో మాట్లాడాలని వచ్చాను" అన్నాడు.

"రా! నా రూం లోకి వెళ్ళి మట్లాడుకొందాం" అన్నాడు చక్రవర్తి.

రూం లోకి వెళ్ళగానే అడిగాడు "మా ఆస్థులు కుదవపెట్టి 10 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకొన్నారు కదా అవేమయ్యాయి?" అంటూ.

"నాకేం తెలుసురా మీ నాన్నకి చెడు స్నేహాలెక్కువ. అదంతా ఏ ఆడవాళ్ళకి ధారపోసాడో" అన్నాడు చక్రవర్తి.

అప్పటివరకూ ప్రశాంతతతో మనసుని బుజ్జగిస్తున్న కృష్ణమోహన్ కి ఉవ్వెత్తున లేచిన కోపం చక్రవర్తి కాలర్ పట్టుకొనేలా చేసింది. "ఎవరికున్నాయిరా చెడు స్నేహాలు? లాడ్జ్ లో దొరికిపోయి బ్రోతల్ కేసులో నువ్విరుక్కొంటే జామీనిచ్చి మా డాడీ కాదా తీసుకొచ్చినది? నాకేమీ తెలియవనుకొంటున్నావా" అన్నాడు ఆవేశంగా.

తడబడుతూ... "అదంతా అబద్ధం నీకెవరు చెప్పారోగానీ ఇంక నువ్వెళ్ళొచ్చు ఏదో మావాడి స్నేహితుడివని ఇంట్లోకి రానిస్తే నా కాలర్ పట్టుకొంటావా చూస్తూండు నీకూ మీ అమ్మకూ నిలువ నీడలేకుండా చేస్తాను. వాచ్ మన్ వాచ్ మన్" అని అరుస్తూ గది బయటికి నెట్టాడు కృష్ణమోహన్ని.

అప్పుడే అక్కడికి వచ్చిన శారద పడబోతున్న కృష్ణమోహన్ని పట్టుకొని అతను తీసుకొచ్చిన ఫైల్సన్నీ అతనికిచ్చి "నువ్వెళ్ళు బాబూ మీ అంకుల్ తో నే మాట్లాడతాను. రేపు మీ ఇంటికొస్తాను" అంది.

"నో ఆంటీ విషయమేంటో ఇప్పుడే తేలాలి. మా ఆస్థులన్నీ మా స్వాధీనమయ్యేదాకా నే విశ్రమించేది లేదు" అంటున్న కృష్ణమోహన్ని కోపంగా చూస్తూ...

"ఉండు ఇప్పుడే పోలిసులకి ఫోన్ చేస్తా వాళ్ళే నిన్ను పంపిస్తారు" అంటూ హాల్ లోకి వెళ్ళిపోయాడు చక్రవర్తి.

********************************************************************************* సశేషమిక్కడే.......మరల 23-5-13 వరకూ.......అప్పటివరకూ చదువరులూ శలవ్

*********************************************************************************

Thursday 9 May 2013

Episode -2




వాతావరణం తేలికపడినట్లనిపించింది స్ఫూర్తికి. శ్రీదేవి సైతం స్నేహమయి కావడంతో ఇద్దరూ ఒక అరగంటలో బాగా కలిసిపోయారు. తొలిరోజులు కావడంతో పెద్దగా క్లాసులేం జరగలేదు పరిచయాలయ్యాయి అంతే.

క్లాసునుంచి బయటికొచ్చేసరికి వాసు నిలబడి ఉన్నాడ
ు. స్ఫూర్తి చేతిలో బుక్స్ అందుకొని పార్కింగ్ వైపు దారితీసాడు. ఆరోజు విశేషాలన్నీ చెపుతూ గలగలా నవ్వుతూ అతనితో ముందుకు నడిచింది స్ఫూర్తి. వాసు స్ఫూర్తి కార్ డ్రైవర్. కృష్ణమోహన్ బాల్య మిత్రుడు కావడంతో అతని దగ్గర కాస్త చనువు ఉంది స్ఫూర్తికి. అయినా వాసు ఏనాడూ హద్దు మీరలేదు. ఎవరెన్ని సార్లు చెప్పినా స్ఫూర్తిని "అమ్మా, మీరూ" అనే పిలుస్తాడు.

"బాగుందమ్మా మీరు కలుపుగోలుగా ఉంటారు కాబట్టి ఎవరైనా మీతో స్నేహం ఇట్టే చేసేస్తారు. త్వరగా పదండి పొద్దుణ్ణుంచీ అలిసిపోయి ఉన్నారు. మొహం వాడిపోయి ఉంది" అంటూ వేగంగా నడిచిన వాసుని అనుసరించింది.

ఇంటికెళ్ళగానే హాల్ లో కూర్చొని బుక్ చదువుతున్న కృష్ణమోహన్ ను చూసి "గుడీవినింగ్ పపా" అంటూ దగ్గర చేరింది.

"గుడీవినింగ్ బేబీ! హౌ ఈజ్ యువర్ ఫస్ట్ డే ఇన్ ఇండియన్ యూనివర్సిటీ" అని అడిగారు చిరునవ్వుతో.

"సో నైస్ పపా" అంటూ విశేషాలన్నీ చెప్పింది.

అంత హేపీగా స్ఫూర్తి ఉండడం ఇండియాకి వచ్చాక మొదటిసారి కావడంతో కాస్త రిలీఫ్ అనిపించింది. "ఓకే బేబీ గో అండ్ రిఫ్రెష్. ఎ గిఫ్ట్ ఈజ్ ఎవైటింగ్ ఇన్ యువర్ రూం" అంటూ మరలా పుస్తకంతో చాటింగ్ మొదలెట్టారు కృష్ణమోహన్.

"వాట్ ? క్రిష్టినా ఆంటీ వచ్చిందా పపా" అంటూ వేగంగా మెట్లెక్కి పైకి పరిగెత్తింది స్ఫూర్తి.

రూం లోకి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి "ఆంటీ" అంటూ ఆనందంగా కేరింతలు కొడుతూ ఆమెను అల్లుకుపోయింది స్ఫూర్తి.

"హౌ ఆర్ యూ బేబీ" అంటూ స్ఫూర్తి నుదుటిపై చుంబిస్తూ దగ్గరకు తీసుకొంది క్రిష్టినా.

"ఫైన్ ఆంటీ, ఐ మిస్ యూ ఎ లాట్. హౌ ఎబౌట్ యూ" అంటూ ప్రశ్నలు గుప్పించింది.

"మీ టూ మిస్ యూ డియర్. గో అండ్ హేవ్ యువర్ బాత్" అంటూ స్ఫూర్తిని మృదువుగా బాత్రూం లోకి నెట్టింది క్రిష్టినా.

స్ఫూర్తి వచ్చేలోపు కృష్ తో మాట్లాడదామా అనుకొంటూనే మరల మనసు మార్చుకొని అక్కడే ఉన్న కెమిస్ట్రీ బుక్ అందుకొంది. కాలం గురించి ఏ మాత్రం పట్టింపులేక చదువులో మునిగిపోయింది క్రిష్టినా స్ఫూర్తి ఆంటీ అని తట్టేవరకూ.

"హాయ్ స్ఫూ....హౌ'స్ యువర్ డే ఎట్ కేంపస్" అంది.

"ఫైన్ ఆంటీ రండి. పపా వెయిట్ చేస్తున్నారు" అంటూ కిందకు దారి తీసింది.

ముగ్గురూ కలిసి కాసేపు గార్డెన్ లో గడిపి డిన్నర్ ముగించుకొని స్ఫూర్తీ, క్రిష్టినా నిద్రపోయాక లేబ్ లోకి వెళ్ళి ప్రయోగాల్లో మునిగిపోయాడు కృష్ణమోహన్. మిల్క్ బాయ్ కాలింగ్ బెల్ మ్రోగిస్తే తప్ప తెల్లవారిందని తెలియనంతగా నిమగ్నమై ఒక కొలిక్కొచ్చిన ప్రయోగాన్ని చూసి సంత్రుప్తిగా తలపంకించి బెడ్ రూం లోకి వెళ్ళి నిద్రపోయాడు.

నిద్ర లేవగానే వీసీగారిచ్చిన కవర్ విషయం గుర్తొచ్చింది కృష్ణమోహన్ కి. కోటు జేబు తడుముకొని ఫోల్డర్ ఓపెన్ చెయ్యగానే ఒక సీల్డ్ కవర్, ఫొటోస్ ఉన్న కవర్, 4పేజెస్ కనిపించాయి. ఫొటోస్ ని పక్కన పెట్టి పేపర్స్ చదవడం మొదలెట్టాడు. అక్షరాలవెంట కళ్ళు పరిగెడుతున్నా మనసు అందులోని వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ ముందుకు సాగిపోతోంది. రాజశేఖర్, శరత్, ప్రజ్ఞ, మధుల బయోగ్రఫీలవి. అవి చదివి దీర్ఘంగా నిశ్వశించి మడిచి ఫోల్డర్ లో పెట్టి ఫొటోస్ ఓపెన్ చేశాడు. మొదటి ఫొటో చూడగానే ఉలిక్కి పడ్డాడు. అది రాజశేఖర్ తల్లి తండ్రులతో ఉన్న ఫొటో. అప్పుడర్థమైంది రాజశేఖర్ తండ్రి గతంలో తన క్లాస్ మేట్ అయిన సామంత్ అని. ఈ విషయం క్రిష్టినాతో చర్చించాలి అనుకొంటూ మిగతా ఫొటోస్ లో శరత్, ప్రజ్ఞల పేరెంట్స్ ని కూడా చూసి అన్నీ ఫోల్డర్ లో పెట్టి సీల్డ్ కవర్ తరవాత చూడొచ్చులే అనుకొంటూ అన్యమస్కంగానే స్నానాదులు ముగించాడు.

హాల్ లోకి వచ్చేసరికి హడావుడిగా కాలేజ్ కి వెడుతూ స్ఫూర్తి కనిపించి "గుడ్మార్నింగ్ పపా. కాలేజ్ కెళ్ళొస్తాను" అంటూ వెళ్ళిపోయింది.

అక్కడే బుక్ చూస్తున్న క్రిష్టినా "గుడ్మార్నింగ్ క్రిష్. ఐ హేవ్ టు గో టుడే" అంది.

"ఓకే... ఐ హేవ్ టు టెల్ యు సం థింగ్" అంటూ ఫోల్డర్ ని క్రిష్టినాకిచ్చాడు.

సామంత్ ఫొటో చూస్తూ షాక్ అయిన క్రిష్టినాని చూసి కృష్ణమోహన్ మనసు గతంలోకి పరుగెత్తింది.

*** *** *** ***

కృష్ణమోహన్ తండ్రి, సామంత్ తండ్రి వ్యాపారంలో భాగస్వాములు. ఇద్దరి భార్యలదీ ఒకే ఊరు కావడం వల్ల కుటుంబాల మధ్య పరస్పర అనుబంధాలు బలపడ్డాయి. తద్వారా కృష్ణమోహన్, సామంత్ చిన్ననాటినుంచీ స్నేహితులయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవగానే పై చదువుల నిమిత్తం లండన్ వెళ్ళిన వాళ్ళకి క్రిష్టినా దోస్తయింది. ఎప్పుడూ తన చదువు తప్ప మరో ప్రపంచం తెలియని కృష్ణమోహన్ కి తెలియకుండానే క్రిష్టినా సామంత్ ల మధ్య అనుబంధం బలంగా పెనవేసుకొంది. లండన్ లో పెరిగినా భారతీయ సాంప్రదాయాలను ఇష్టపడి గౌరవించే క్రిష్టినా ఇండియాకి వెళ్ళాక పెళ్ళి చేసుకొందాం అని సామంత్ ని ఒప్పించింది. చూచాయగా వాళ్ళ విషయం చెవిన పడుతున్నా థీసిస్ సబ్మిట్ చేసే హడావుడిలో వాళ్ళను పెద్దగా పట్టించుకోని కృష్ణమోహన్ దగ్గరికి ఒకరోజు టెన్షన్ గా వచ్చిన సామంత్ "కృష్ణా! నే అర్జెంట్ గా ఇండియా వెడుతున్నా" అన్నాడు.

"అరే! ఏమయ్యిందిరా? అమ్మా నాన్న బాగున్నారుగా?" అని ఆరాటంగా అడిగిన కృష్ణమోహన్ భుజం పై తట్టి, "నథింగ్ రాంగ్. జస్ట్ ఐ నీడ్ టు గో. మరలా 15 డేస్ లో వస్తాను" అని చెప్పి మారు మాట్లాడే అవకాశమివ్వకుండా వెళ్ళిపోయాడు.

రెండ్రోజులు గడిచాయి. క్రిష్టినా వచ్చింది. "క్రిష్, సామంత్ ఏడి?" అని అడిగింది.

"ఇండియా వెళ్ళాడు 10 డేస్ లో వస్తానన్నాడు. నీకు చెప్పలేదా" అని అడిగాడు.

"లేదు క్రిష్. మేము పెళ్ళి చేసుకోవాలనుకొన్నాం. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను అన్నాడు. మరలా కనిపించలేదు. అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను" అంది.

"ష్యూర్ క్రిష్టినా! ప్లీజ్ టేక్ యువర్ సీట్ అండ్ రిలాక్స్" అన్నాడు.

"నో క్రిష్! విల్ మీట్ యు విత్ సామంత్" అంటూ వెళ్ళిపోయింది క్రిష్టినా.

వారం గడవగానే సామంత్ వద్దనుంచి మెయిల్ వచ్చింది. తను, క్రిష్టినా ప్రేమించుకొన్న విషయం, క్రిష్టినా తల్లి కాబోతోందని తెలియగానే తల్లి తండ్రులకు చెప్పి పెళ్ళి చేసుకొంటాను అని కాల్ చేసి పేరెంట్స్ తో మాట్లాడగానే తనను అర్జెంట్ గా ఇండియా పిలిపించి తన మరదలితో తనకి పెళ్ళి హడావిడిగా జరిపించిన విషయం చెప్పి క్రిష్టినాతో తనను మరిచిపొమ్మని తన తరఫున చెప్పమని సింపుల్ గా ముగిసిన ఆ మెయిల్ చదివి స్థాణువైపోయాడు కృష్ణమోహన్. చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగిన తనకి చెప్పకున్నా అర్థం చేసుకుంటాడు గానీ తనను నమ్మి తల్లి కాబోతున్న క్రిష్టినా కు కనీసం తెలియజేయకుండా పెళ్ళికూడా చేసేసుకొని మొహం చాటేయడం కృష్ణమోహన్ మనసును కలచివేసింది.

విషయం వివరించి క్రిష్టినా పేరెంట్స్ కి నచ్చచెపుదామని క్రిష్టినా ఇంటికి బయలుదేరాడు. గుమ్మంలో అడుగెడుతూనే ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని కార్యోన్ముఖుని చేసింది. క్రిష్టినా సవతి తల్లి క్రిష్టినాని కత్తితో పొడవబోతోంది.

"నో మామ్! ప్లీజ్ లీవ్ మీ. సామంత్ విల్ డెఫినిట్లీ మేరీ మీ. ప్లీజ్ బిలీవ్ మీ" అంటూ వెనక్కు జరుగుతోంది.

పరుగెత్తి క్రిష్టినాని రక్షించే ప్రయత్నంలో కార్పెట్ కాలికి తగిలి బోర్లా పడిపోయాడు. ఈలోగా క్రిష్టినాని సవతి తల్లి పొడిచేయడం, "మా..." అని అరుస్తూ క్రిష్టినా పడిపోవడం జరిగిపోయాయి.

------------------------------
---------------------------------------------------------------------------------------- సశేషమిక్కడే.......మరల 16-5-13 వరకూ.......
------------------------------
----------------------------------------------------------------------------------------

Thursday 2 May 2013

ఎపిసోడ్ - 1

ఆంధ్రా యూనివర్సిటీ కేంపస్ కళకళ లాడుతోంది. సమ్మర్ వెకేషన్ అనంతరం ఓపెన్ అయి కొద్దిరోజులే కావడంతో గాలి సైతం కొత్త పాత విద్యార్థుల కలయికకు పూలతో మేళవించి పరిమళిస్తూ స్వాగతమిస్తోంది. పచ్చికలో మెత్తగా నడుస్తున్న అమ్మాయిల పాదాలు, నడుంపైన నాట్యాలాడుతున్న కొందరు విరికొమ్మల వాలు జడలు, వారిపై కామెంట్స్ తో అల్లరి చేస్తున్న ఆకతాయిలు, బెరుగ్గా లోపలకి అడుగుపెడుతున్న కొత్త స్టూడెంట్స్, వాళ్ళల్లో బకరాలు దొరికితే ఓ చూపు చూద్దామనుకొంటున్న సీనియర్స్, వీళ్ళందరితో కేంపస్ మొత్తం కోలాహలంగా ఉంది.

ఇంతలో ఒక బ్లాక్ ఇన్నోవా వచ్చి మెత్తగా ఆగింది. అది కన్వీనర్ గారిది కావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. వెన్వెంటనే వెనుక కవాతు చేస్తున్న సైనికుల్లా వచ్చి ప్రిన్సిపాల్స్, డీన్స్, స్పెషల్ ఆఫీసర్స్ వెహికిల్సన్నీ వచ్చాయి. బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని కన్వీనరు దిగారు. ఇంతలో లోపలినుంచి వీ. సీ. గారు బయటకు వచ్చారు.

"హార్టీ వెల్కం టూ అవర్ బిలవ్డ్ సైంటిస్ట్ మిస్టర్ కృష్ణమోహన్" అంటూ స్వాగతించారు.

కృష్ణమోహన్ ... ఇండియా గర్వించదగ్గ గొప్ప నిస్వార్ధ సైంటిస్ట్. లండన్ లో శతృదేశాల అణ్వాయుధాలను నిర్వీర్యం చేసే పరికరాన్ని కనిపెట్టే దిశగా ప్రయోగాలు చేస్తూ అది ఆఖరి దశలో ఉండగా భారత దేశం నుంచి పిలుపు వచ్చేసరికి ప్రయోగాన్ని మధ్యలో ఆపి ఇండియాకి తిరిగొచ్చారు. వారికి భారతావనికి అత్యంత అవసరమైన, మరియు క్లిష్టమైన ప్రయోగాన్ని ప్రభుత్వం అప్పగించడం జరిగింది. ఆ ప్రయోగానికి అవసరమైన సహకారం కోసం అత్యంత నమ్మకస్తులైన సైంటిస్టుల నిమిత్తం కృష్ణమోహన్ యూనివర్సిటీ వారి ఆహ్వానాన్నందుకొని రావడం తటస్థించింది.

కారు డోర్ తీసుకొని ఒక స్ఫురద్రూపి దిగారు. ఆరడుగుల నిండైన విగ్రహం, విజ్ఞతకు సూచనగా చిరుముడతలు పడిన నుదురు, చురుగ్గా చూస్తున్న కళ్ళు, మేధావిత్వానికి సంకేతమన్నట్లు అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు, చూడగానే ఎవరికైనా నమస్కరించాలనిపించే హుందాతనంతో కృష్ణమోహన్ బయటకు వచ్చేసరికి పైనుంచి పూల వాన కురిసింది.

మొహమాటపడుతూ "సర్! వాట్స్ దిస్?" అని వీసీ గారివైపు చూసారు కృష్ణమోహన్.

చిరునవ్వుతో "ఇట్స్ అవర్ ఫార్మాలిటీ సర్" అని జవాబిచ్చారు వీ సీ.

"కమాన్ బేబీ" అంటూ కారులోకి చూస్తూ పిలిచారు కృష్ణమోహన్.

అందరూ ఆత్రుతగా చూస్తుంటే డోర్ తీసుకొని దిగింది ఒక జాజిమొగ్గలాంటి అమ్మాయి. మోముపై ఆటలాడుతూ గాలికి అల్లల్లాడే మెత్తని కురులను పైకి తోసుకునే వేళ్ళ సోయగమే చూపరులను అచ్చెరువులను చేస్తోంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం పెంచబడిన సౌకుమార్యం అక్కడ కొలువుదీరినట్లనిపిస్తోంది. మల్లెపూలు, మెత్తని గంధం కలిపి రంగరించినట్లున్న మేని ఛాయ, తీరైన కనుముక్కు తీరు, అమ్మాయిలు సైతం అసూయ పడే అందం తో నడుము దాటిన జడ నయగారాలు పోతూ అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తూ దివి నుంచి దిగిందా అని భ్రమింపజేస్తున్న లావణ్యం కృష్ణమోహన్ వెనుక నిలిచింది.

"మీట్ మై డాటర్ స్ఫూర్తి" అని పరిచయం చేసారు.

వినయంగా నమస్కరించింది వీసీ గారికి తదితరులకు. అందరూ కలిసి లోపలికి నడిచారు. వెన్వెంటనే పూర్ణ కుంభాలతో పురోహితులు స్వాగతం పలికి దీర్ఘాయురస్తని దీవించారు. రండి కృష్ణ మోహన్ అంటూ కాంఫరెన్స్ హాల్ కి దారితీసారు వీసీ.


కాంఫరెన్స్ హాల్ లో డైరెక్టర్స్, డిన్స్, స్పెషల్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒక ముగ్గురు రిసెర్చ్ స్టూడెంట్స్ కు కూడా మీట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు. కేంపస్ మొత్తం హాజరయ్యేలా ఈవినింగ్ అభినందన సభ ఏర్పాటు చేసినా కృష్ణమోహన్ సమయాభావమని చెప్పి అంగీకరించకపోవడంతో అప్పటికప్పుడే కాంఫిడెన్షియల్ మీట్ ఏర్పాటు చేసారు.

మీటింగ్ వెంటనే స్టార్ట్ అయింది. వీ సీ గారు స్వయంగా వేదికపై నున్న కృష్ణమోహన్ ను సభికులకి పరిచయం చేసారు.

"కృష్ణమోహన్ ఈజే గ్రేట్ సైంటిస్ట్. భారత ప్రభుత్వం ఆత్మాహుతి దళాల ప్రయోగాలను తిప్పికొట్టే పిల్స్ తయారు చెయ్యమంటే వచ్చారు వారికి వ్యవధి తక్కువగా ఉంది. అందుకని మన యూనివర్సిటీలో విద్యార్థులను తనకు సహాయకులుగా తీసుకొమ్మని అభ్యర్థించాము. వారి వారసులు మన విద్యార్థులవడం కన్నా మనకు కావలిసినదేముంది. ఇప్పుడు కృష్ణమోహన్ మాట్లాడతారు" అని చెప్పి క్లుప్తంగా ముగించారు వీసీ.

కృష్ణమోహన్ లేచి పరిచయాలు ముగించుకొని ఓ రెండు నిమిషాలు దేశానికి తాము చెయ్యవలసిన సేవ గురించి కాస్త ఉద్వేగంగా మాట్లాడారు. ఆపై త్వరగా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే ఐ హేవ్ టు అటెండ్ మై జాబ్ అని ముగించారు. "షి ఈజ్ మై డాటర్ స్ఫూర్తి. షి విల్ జాయిన్ ఇన్ ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిష్ట్రీ హియర్" అనగానే అందరూ క్లాప్స్ తో ఆహ్వానించారు.

వెంటనే డిపార్ట్మెంట్ హెడ్స్ ని కృష్ణమోహన్ కీ, స్ఫూర్తి కీ పరిచయం చేయడం మొదలెట్టారు కన్వీనర్. ఆర్గానిక్ కెమిష్ట్రీ హెడ్ "కృష్ణవేణి" ని పరిచయం చెయ్యగానే ఆమెలో ఏదో అనీజీనెస్ కనిపించింది స్ఫూర్తికి. హడావుడిగా సాగిపోతున్న కృష్ణమోహన్ ఏమీ గమనించనట్లు ముందుకు సాగిపోయారు. అనంతరం స్టూడెంట్స్ ను పరిచయం చేసారు "హి ఈజ్ రాజశేఖర్ డూయింగ్ పీ హెచ్ డీ ఇన్ ఆటమిక్ ఎనర్జీ, శరత్, మధు, ప్రజ్ఞ ఆల్సో ఇన్ ఆటమిక్ ఎనర్జీ" అంటూ.

రాజశేఖర్ లో ఏదో తెలియని ఆకర్షణ బహుశా అతని రిజర్వ్ నెస్ కావొచ్చును. మేధావిత్వం అతని కళ్ళలో స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది. ఆజానుబాహుడు, అరవింద నేతృడు అన్నట్లున్న విగ్రహం, ఎదుటి వ్యక్తిని చదివేస్తున్నట్లున్న చూపు, మోములో ఏదో శోధిస్తున్నట్లున్న భావాలు, ఇవన్నీ కలబోసి కనిపించి కృష్ణమోహన్ తనకి సపోర్ట్ చేయగల వ్యక్తిగా ఆతన్ని ఎంచుకొన్నారు. తనకి అవసరమైన పర్యవేక్షకునిగా శరత్ ని నియమించుకొన్నారు. మీట్ ముగిసింది. హేపీగా అందరూ డిస్బర్స్ అయ్యారు.

రాజశేఖర్లో ఉవ్వెత్తున ఉప్పొంగిన ఆనందం. జగజ్జేత అయిపోయిన ఫీలింగ్. తనకు సహకారం అందించేందుకు కూడ తన చిన్ననాటి నేస్తమే సెలెక్ట్ కావడంతో ఆతనిలో ఆనందం అవధులు దాటింది. శరత్ లో ఆకాశాన్నందుకొన్నంత ఆనందం. కలలో కూడా ఊహించని ఇంత అరుదైన గౌరవం తనకు దక్కినందుకు పొంగిపోయాడు. ఇంతవరకూ తన జీవితాన్ని తీర్చిదిద్దిన రాజశేఖర్ కు ఎంత ఋణపడిపోయానో అని కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ ఎన్నో భావాలు...

వడివడిగా ముందుకు సాగిపోతున్న కృష్ణమోహన్ చేతికి వీ. సీ గారు ఒక ఫోల్డర్ ఇచ్చారు.

"ప్లీజ్ హేవ్ ఎ లుక్ మిష్టర్ కృష్ణమోహన్" అంటూ.

"ష్యూర్ సర్. వి విల్ మీట్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్" అని జవాబిచ్చి కార్ లో కూర్చొన్నారు కృష్ణమోహన్.

వింటినుంచి వెలువడ్డ బాణంలా దూసుకుపోయింది కారు. ఒంటరిగా నిలిచిన స్ఫూర్తి వద్దకు వచ్చి రాజశేఖర్, శరత్, ప్రజ్ఞ, ఆమె క్లాస్ రూం చూపి లేబ్ కు వెళ్ళిపోయారు.

క్లాస్ లో అడుగు పెట్టగానే స్టూడెంట్సంతా గౌరవసూచకంగా లేచి స్వాగతించడంతో కాస్త ఇబ్బంది పడింది స్ఫూర్తి. ప్రతీ అమ్మాయి స్ఫూర్తి తన పక్కన కూర్చోవాలని ఆరాటపడ్డారు. కాని ఒక్క అమ్మాయి మాత్రం అంతగా ఆరాటం చూపలేదు జస్ట్ ఫార్మాలిటీ సేక్ అన్నట్లు పక్కకు జరగడం తప్ప. ఆ నేచర్ చూసి ఆకర్షితురాలైన స్ఫూర్తి ఆమె పక్కన కూర్చోగానే మిగిలినవాళ్ళంతా నిట్టూర్చడం స్పష్టంగా తెలిసి కాస్త నవ్వుకొంది.

"ఐ యాం స్ఫూర్తీ, స్ఫూర్తీ కృష్ణమోహన్" అంటూ స్వపరిచయం చేసుకొంది పక్కనున్న క్లాస్మేట్ తో.

వెంటనే పక్కమ్మాయి కాస్త తడబడుతూ "ఐ యాం శ్రీదేవి, జస్ట్... శ్రీదేవి" అంటూ నవ్వేసింది.

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సశేషమీ నవ్వుల తో........మరల 9-5-13 వరకూ.......
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 

Friday 26 April 2013

ముందుమాట

 

"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ"

అమ్మను సైతం కన్న జన్మభూమి గొప్పదనం చెప్పడానికి ఎవరికైనా భాషా రాహిత్యమే. అటువంటి జన్మభూముల్లో ఎప్పుడూ తలమానికమై అగ్రస్థానంలో నిలిచే స్థాయి కేవలం మన భారతావనికే ఉందని నమ్మే ఒక శాస్త్రవేత్త కృష్ణమోహన్. తన జీవితాన్ని మరచి జీవితానందాన్ని శూన్యం చేసుకుని తను నమ్మిన నైతిక విలువలను కాపాడుకొంటూ దేశానికి తన విజ్ఞాన ఫలాన్ని అందించడానికి చేసే పోరాటము, ఆ పోరాటంలో అనుక్షణం ఎదుర్కొన్న సుడిగాలుల పర్యవసానమే "జీవితవనంలో కొత్తగాలి వంటి స్ఫూర్తీ ! ఐ లవ్ యూ"

స్త్రీ... అందానికి నిర్వచనం ప్రేమకు ప్రతిరూపం మానవతకు మణిదీపం ఇలా ఎందరో కవులు ఎన్నో విధాలుగా మగువను అగ్రస్థానంలో నిలబెట్టారు... కానీ ప్రేమించే భావన ఒక్క స్త్రీకే పరిమితం కాదు... అంతకన్నా ఎక్కువగా అంతే స్వచ్ఛతతో ప్రేమించిన మగవాడు తన అస్థిత్వాన్ని సైతం మరిచి మనసిచ్చిన మగువ కోసం చేసిన త్యాగానికి ప్రతిరూపం...

"స్ఫూర్తీ ! ఐ లవ్ యూ"...

వలపు... ఒక అనుభూతి... ఒక్కోసారి అప్రాప్త ప్రాప్తమవుతుంది కొందరికి...

వలపు... ఒక ఎండమావి... ఒక్కోసారి తీరని దాహమవుతుంది ఎందరికో...

వలపు... ఒక శీతలసమీరం... అది గతకాలపు జ్ఞాపకం కాబట్టి ....

ఆ అనుభూతి అనిర్వచనీయం కాబట్టి...

ఆ వలపు కోసం నైతిక విలువలకోసం తన స్నేహాన్నే త్యాగం చేసి తన మనసుతో విధి ఎంత చెలగాటమాడినా మొక్కవోని ధైర్యంతో తన ప్రేయసి చేయినందుకొన్న మరో కర్ణుని నిర్మల ప్రేమ కథే "స్ఫూర్తీ ! ఐ లవ్ యూ".

- పద్మా శ్రీరామ్...